• Sat. May 24th, 2025 2:17:20 AM

అంతర్యామి పూరీ వైభవ యాత్ర

Jul 15, 2018 #find India
అంతర్యామి పూరీ వైభవ యాత్ర

అద్భుతాల నిలయమైన పూరీ క్షేత్రంలో ఎన్నో     ప్రత్యేకతలు ఉన్నాయి, పౌరాణిక ప్రశస్తి, చారిత్రక ప్రాముఖ్యం, అశేష జన భక్తిశ్రద్ధలు… ఎన్నో ఈ    ఆలయంతో ముడివడి ఉన్నాయి.

దారు విగ్రహాలే మూలవిరాట్టులుగా ఉంటూ, పన్నెండేళ్ళకోసారి ‘నవకళేబరోత్సవం’ జరిగినప్పుడు నూతన విగ్రహాలు మారడం ఈ క్షేత్రానికే పరిమితమైన అద్భుత వైశిష్ట్యం. పాత విగ్రహాల్లోని దేవతా కళా చైతన్యాన్ని నూతన విగ్రహాల్లోకి అక్కడి ఆగమ శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రవేశింపజేయడం మరో ప్రత్యేకత. పాత మూర్తులను శాస్త్రవిధితో పాతిపెట్టి, నూతన మూర్తులను ఆరాధిస్తారు. 
వివిధ మాసాల్లో, వివిధ పర్వాల్లో వేర్వేరు ఉత్సవాలు ఎన్నో జరుగుతున్నా, ఆషాఢ శుద్ధ విదియనాడు జరిగే ‘రథయాత్ర’ మాత్రం విశ్వవిఖ్యాతి చెందింది. సాక్షాత్తు ఆలయంలోని నాలుగు మూలవిరాట్టులు మూడు రథాల్లో ఊరేగి ప్రజల మధ్యకు రావడం ఈ క్షేత్ర విలక్షణత.

అత్యంత ప్రాచీన కాలం నుంచి ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ యాత్రకు ఎంతో చారిత్రక   ప్రాధాన్యం ఉంది.

ప్రధానాలయం నుంచి ‘గుండిచా’ మందిరానికి సాగే యాత్ర ఇది. అక్కడ సుమారు పది రోజులు ఉండి, తిరిగి ఆలయానికి (బహుదా) మారుయాత్ర జరుగుతుంది. స్కంద పురాణం ప్రకారం- ఇంద్రద్యుమ్న చక్రవర్తి నారదుడి పర్యవేక్షణలో దివ్య యజ్ఞాన్ని ఆచరించిన చోటు గుండిచా మందిర స్థలం. ఆ యజ్ఞస్థలానికి స్వామి ఏటా విచ్చేయడం పురాణ కథ. పురాణాల ప్రకారం- ఆదియుగంలో నీలాచల పర్వత ప్రాంతమిది. నారాయణుడు నీలామాధవుడిగా ఇక్కడ పూజలందుకొనేవాడు. కేవలం రుషులు, సిద్ధపురుషులు, దేవతలు దర్శించుకొనే ఈ మాధవస్వామి- కొందరు ఆటవికులకు ప్రత్యేక సమయాల్లో దర్శనమిచ్చి ఆరాధనలందుకొనే దైవం. కాలాంతరంలో ఈ స్వామి తన స్వరూపాన్ని ఉపసంహరించుకొని, తిరిగి ఇంద్రద్యుమ్నుడి భక్తికి, యజ్ఞదీక్షకు ప్రసన్నుడై సాక్షాత్కరించాడు. విశ్వకర్మ మలచిన దారుమూర్తులుగా తాను అక్కడ నెలకొంటానని అనుగ్రహించాడు.

ఆ వరాన్ని అనుసరించి నిర్మించిన మందిరంలో, శిల్పించిన దారుమూర్తులుగా ఒకే నారాయణ బ్రహ్మం నాలుగు రూపాలతో వెలసింది. అవే జగన్నాథ-బలభద్ర-సుభద్రా-సుదర్శన విగ్రహాలు.

ప్రాంత ఐతిహ్యాలు, జానపదుల కథలు, కల్పనలు, గాథలు ఎన్ని ఉన్నా- పౌరాణిక వాఙ్మయం ప్రకారం ఈ నాలుగు మూర్తులు నారాయణ సంకల్పానుగుణంగా తీర్చినవి. మధ్యలో విడిచిన అర్ధశిల్పాలు కావు. ‘ఆననం’(ముఖం) ప్రత్యేకంగా ఉంటూ, మిగిలిన శరీర భాగాలు సంకేతంగా ఉండటమే ఈ మూర్తి ప్రత్యేకత.

అనంతత్వానికి సంకేతంగా నీలవర్ణం జగన్నాథ రూపం. శుద్ధత్వం తెల్లని రంగు ఉన్న బలభద్రుడు. శక్తి పసుపురంగు సుభద్రాదేవి. తెల్లని స్తంభాకృతిలో నడుమ చెక్కిన గుండ్రని సుదర్శన మూర్తి. ఈ నాలుగు ఋక్‌-యజు-సామ-అధర్వణ వేదాలుగాఉన్న ఒకే వేదనారాయణునిమూర్తులని పురాణం చెబుతోంది. చక్రాల వంటి రెండు నేత్రాలుగా అనంతదర్శన శక్తి జగన్నాథమూర్తిలో దర్శనమిస్తుంది. సంకర్షణ స్వరూపం బలభద్రమూర్తిగా, శక్తిరూపం సుభద్రగా, ఆయుధశక్తి సుదర్శనంగా ఇక్కడ జగన్నాథుడితోపాటు కొలువుతీరి ఉన్నాయి.

ఈ క్షేత్రం, మందిరం, దేవతలు, ఉత్సవాలు, రథయాత్ర… వీటిని ఆధారంగా చేసుకుని విస్తారమైన సంస్కృతి వర్ధిల్లింది. చిత్ర-శిల్ప-సంగీత-సాహిత్య-నాట్యాది కళలు ఎన్నో కమనీయంగా శోభలు  దిద్దుకున్నాయి.ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జనవాహిని తరలివచ్చే ఈ మహారథయాత్ర సమైక్య సమన్వయ సామరస్య భారతీయతకు ఒక బృహత్‌ స్వరూపం!
https://sharechat.com/post/vAv03z

Leave a Reply

PrevNext
January 2016
SuMoTuWeThFrSa
     12
3456789
10111213141516
17181920212223
24252627282930
31