• Thu. Nov 28th, 2024

విశాఖపట్నం లోని “సంపత్ వినాయగర్” ఆలయం

May 27, 2021 #find India
*** విశాఖపట్నం లోని “సంపత్ వినాయగర్” ఆలయం ***
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో,  విశాఖపట్నంలోని **సంపత్ వినాయక” (లేదా) “శ్రీ సంపత్ వినాయగర్” ఆలయం  బహు ప్రసిద్ధి చెందిన ఖండాతర ఖ్యాతిగల  ఆలయం.  ఈ ఆలయ వైశాల్యం “చాలా చిన్న” గా ఉంటుంది.   బొజ్జ గణపయ్య కొలువుతీరిన  అతి బుల్లి  ఆలయం.   ఈ ఆలయం లో కొలువైన స్వామివారిని,  సకల సంపదలూ అనుగ్రహించే దైవంగా, వాస్తుదోషం నివారణకు అధిష్టాన దేవతగా భక్తులు ఆరాధిస్తారు.  
ఈ ఆలయాన్ని, ముగ్గురు ఒకే  కుటుంబీకులు  కలిపి కట్టించారు.  తమ వ్యాపారకార్యాలయం ఎదుట వాస్తుదోష నివారణార్థం  వ్యక్తిగతంగా     నిర్మింపచేసుకొన్న మందిరము  “సంపత్ వినాయక” ఆలయం.
విశాఖపట్నంలోని ఆసీలమెట్ట వద్ద ఉన్న ఈ ఆలయం  S.G. సంబందన్ & కో. వారికి చెందినది. దీనిని 1962 వ సంవత్సరంలో స్వర్గీయ  S.G. సంబందన్,  స్వర్గీయ T.S. సెల్వంగనేషన్  మరియు శ్రీటి.ఎస్.రాజేశ్వరన్  లు వారి యొక్క, వారి కుటుంబ సభ్యుల యొక్క ఆరాధన కోసం, వారి వ్యాపారకార్యాలయ ప్రాంగణంలోనే  నిర్మింప  చేసుకొని, వారి ఖర్చులతోనే నిర్వహించేవారు.     కాల వ్యవధిలో, స్థానికమత్స్యకారులు (జాలర్లు)  వారి రోజువారీ  వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేముందు  తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి  ప్రతిరోజూ  స్వామివారికి దీపం వెలిగించి,  భక్తి శ్రద్ధలతో ప్రార్ధించి మంచి ఫలితాలను పొందేవారు.  సర్వ సంపత్ ప్రదాతగా ఇక్కడ కొలువైన స్వామికి “సంపత్ వినాయకుడు”  లేదా “సంపత్ వినాయగర్ ”  అని పేరు.
జగద్గురువులు,  ప్రాతఃస్మరణీయులు, నడిచే దైవంగా పేరుగాంచిన “కంచి పరమాచార్య”  శ్రీ శ్రీ శ్రీ  చంద్రశేఖరరేంద్ర సరస్వతి మహాస్వామివారు  తమ అమృత హస్తాలతో  “మహాగణపతి యంత్రాన్ని”  1967 వ సంవత్సరంలో ఈ ఆలయంలో నిక్షేపంచేసి,  ఆలయ వైభవాన్ని మరింత తేజరిల్ల చేశారు.      ఇక్కడ కొలువున్న స్వామి సదా ప్రసన్న వదనుడై భక్తులకు  అటు ఆధ్యాత్మిక సంపత్తిని, ఇటు ఐహిక సంపత్తిని ప్రసాదించే  “సంపత్ వినాయకుడైనాడు”. 
1971లో , ఇండియా …. పాకిస్తాన్ యుద్ధ సమయంలో, తూర్పు నావల్ కమాండ్ కు  చెందిన **అడ్మిరల్ కృష్ణన్** గారు పాకిస్థాన్ దాడి నుండి విశాఖపట్నాన్ని  రక్షించటానికి  ఈ సంపత్వినాయకుని  ప్రార్ధించి,  స్వామివారి సన్నిధిలో  1001 కొబ్బరికాయలు కొట్టారు.  ఇది జరిగిన కొద్దిరోజులకే పాకిస్తాన్ సబ్మెరైన్ పిఎన్ఎస్ ఘాజీ సముద్రజలాల్లో మన యుద్ధనౌకలపై దాడిచేసేందుకు వచ్చి బాంబులు అమర్చి తిరిగివెళ్తూ అవే బాంబులు పేలిసముద్రంలో మునిగిపోయింది. దీంతో విశాఖనగరానికి పెద్దప్రమాదం తప్పింది.  ఇది పూర్తిగా  సంపత్ వినాయగర్  మహిమయే అని భావించిన శ్రీ కృష్ణన్ గారు ఆయన విశాఖలో ఉన్నంత కాలం ప్రతీ రోజూ ఈ స్వామిని దర్శించి, అర్చించిన తరువాతే తన విధులకు  వెళ్లేవారట.   ఈ సంఘటనతో, ఈ ఆలయ ప్రాముఖ్యం మరింత ఖ్యాతిలోకి వచ్చినట్లు  కూడా స్థానికుల వివరం. 
విశాఖనగర నడిబొడ్డున వెలసిన ఈ సంపత్ వినాయకుని  దర్శించి, అర్చించినంతనే ఎన్నో సమస్యలు వెంటనే  పరిష్కారమౌతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.   సకల విఘ్నాలను హరించి తనను కొలిచేవారికి సంపదలిచ్చే వేల్పుగా  ఈ సంపత్వినాయకుడు ప్రసిద్ధుడు.  ప్రతిరోజూ దాదాపు అయిదువేలమంది భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు.  విశేషించి బుధ, శుక్ర వారాల్లో భక్తుల  తాకిడి ఎక్కువగా ఉంటుంది.   ఇక పర్వదినాల్లో అయితే, ఈ ఆలయం భక్తజన సంద్రమే.
భక్తుల పాలిటి  కొంగుబంగారంగా విరాజిల్లే ఈ స్వామిని దర్శించి సేవించడానికి  విశాఖపట్నం నుంచేకాక చుట్టుపక్కల ప్రాంతాలనుంచి  కూడా  భక్తులు తండోప తండాలుగా తరలి వస్తారు.  శ్రీ  సంపత్ వినాయగర్ స్వామికి  నిత్యం జరిగే “గరిక పూజ”, “ఉండ్రాళ్ళ నివేదన”, “అభిషేకము”, “గణపతి హోమం”, “నిత్య పూజలు”,  “వాహన పూజలు”, ప్రతీ మాసంలో బహుళ చతుర్థినాడు జరిగే “సంకష్టహర చతుర్థి”  పూజలతో     ఆలయం బహు శోభాయమానంగా   ఉంటుంది.    ఈ స్వామి వారికి వివిధ పదార్ధాలతో జరిగే అభిషేకము చాలా వైభవంగా ఉంటుంది.   గంధోదకం, హరిద్రోదకం, ఆవుపాలు,పెరుగు, ఆవునెయ్యి, కొబ్బరి నీళ్లు, ఫలరసాలు, తేనే, శుద్ధోదకం, పంచదారాల తో స్వామివారికి అభిషేకం ఏంతో నేత్రానందంగా నిర్వహిస్తారు.     తరువాత, అర్చకస్వాములు, స్వామివారికి చేసే  అలంకారం  అదొక  “ప్రత్యేకత” అంటే అతిశయోక్తి కాదు. 
ఈ ఆలయంలో సర్వదర్శనమునకు ఎటువంటి రుసుము లేదు.  ఉదయం 6 గంటల నుండి 10.30 గంటల వరకు, సాయింత్రం 5.30 నుండి రాత్రి 8.30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది.
ఈ ఆలయంలో “వాహన పూజ” కి ఎంతో ప్రాముఖ్యం ఉంది.   విశాఖలో లేదా చుట్టుపట్ల ఎవరైనా కొత్త వాహనము/వాహనములు   కొనుగోలు చేస్తే,  తప్పకుండా సంపత్ వినాయక ఆలయానికి వచ్చి తమ వాహనాలు పూజలు చేయించుకొంటారు.  అలా పూజ చేయించడం సర్వ శుభప్రదమని, సకల సంపత్ప్రదమని     భక్తుల నమ్మకం.   అందుకే, ఈ ఆలయంలో “వాహన పూజలు” విశేషంగా జరుగుతాయి..
ఈ ఆలయంలో “ఆంగ్ల” సంవత్సరాదితో పాటు , తెలుగు సంవత్సరాది …”ఉగాది” నాడు కూడా  ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
భాద్రపద శుద్ధ చవితి “వినాయక చవితి”  అత్యంత వైభవం గా నిర్వహిస్తారు.  తొమ్మిదిరోజులపాటు స్వామివారిని వివిధ రూపాలలో అలంకరిస్తారు.    ఈ నవరాత్రి ఉత్సవాలలో స్వామివారిని  బాల గణపతి, ఆది గణపతి, విద్యా గణపతి, రాజ గణపతి, శక్తి గణపతి, శివపూజ గణపతి, స్కంద గణపతి, అగస్త్యపూజ గణపతి, సిద్ధి బుద్ధి గణపతి  అవతారాలలో అలంకరిస్తారు.  ఈ ఉత్సవాలలో,  ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు,  సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన సంతర్పణలు విశేషంగా నిర్వహిస్తారు.
*** ఓం తత్పురుషాయ విద్మహే – వక్రతుండాయ ధీమహి
      తన్నో దంతిప్రచోదయాత్🙏🙏🙏

Leave a Reply